MNCL Collector :మహిళలు, యువతులు, బాలికల సంక్షేమం దిశగా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి స్వరూపారాణితో కలిసి సి.డి.పి.ఓ.లు, సూపర్వైజర్లు, సఖి ఉమెన్ హబ్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, గృహ హింసలకు గురైన మహిళలు, యువతులు, బాలికలకు సఖి కేంద్రం ద్వారా ఆశ్రయం కల్పించి కౌన్సిలింగ్ ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సఖి కేంద్రానికి వచ్చే కేసులను పరిశీలించి వారి పరిధి వరకు తగు చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో సఖి కేంద్రం ద్వారా అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పిల్లల సంరక్షణ దిశగా బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు బాల్య వివాహాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించి బాలికల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించాలని, పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టర్పై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్, మిషన్ వాత్సల్య, బాల సంద్రం ఇతరత్రా బాలల సంరక్షణ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 81 బాల్య వివాహాలను నిలుపుదల చేయడం జరిగిందని, ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని తెలిపారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను పర్యవేక్షిస్తూ అవసరమైన పోషణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. వయోవృద్దుల పోషణ నిర్లక్ష్యం, వేధింపులపై సహాయం కొరకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 14567 సమర్థవంతంగా నిర్వహించాలని, తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రైసైకిల్స్, వీల్చీర్స్, బ్యాటరీ వీల్చైర్స్, ల్యాప్టాప్లు ఇతరత్రా అన్ని పథకాల ఫలాలు అర్హులకు అందించాలని, జిల్లాలోని ట్రాన్సోజెండర్లను గుర్తించి గుర్తింపుకార్డులు, ధృవపత్రాలు అందించాలని, ఆర్థిక అభివృద్ధి చెందేందుకు చేయూత అందించాలని తెలిపారు. ఉమెన్ హబ్ ద్వారా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ సమయానుసారంగా పరీక్షలు నిర్వహించకునేలావారికి అవగాహన కల్పించాలని, సరైన లైసెన్స్ లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను గుర్తించాలని తెలిపారు. వారం రోజులలోగా అన్ని కార్యక్రమాల పూర్తి వివరాలతో నివేదికలు రూపొందించి అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల