న్యాయం చేయాలంటూ పెట్రోల్ డబ్బాతో వచ్చిన బాధితులు
పెట్రోల్ డబ్బాను లాక్కున్న సెక్యూరిటీ
అక్రమ పట్టా చేసుకున్న శ్రీనివాస్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్
Sucide Attempt : మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో బాధితులు పెట్రోల్ డబ్బాతో రావడంతో కార్యాలయంలో కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాధితులు న్యాయం చేయాలంటూ మూడు పెట్రోల్ డబ్బాలతో వచ్చారు. కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామా శివారులో గల 11 ఎకరాల భూమిని పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి అక్రమ పట్టా చేసుకున్నాడని శీలం బాయక్క, శీలం పోషయ్య, శీలం సత్తయ్యలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ భూమి నలుగురు అన్నదమ్ములకు చెందవలసిన భూమి కాగా శీలం కిష్టయ్య కొడుకైన శీలం శ్రీనివాస్ దొంగ పొట్ట చేసుకున్నాడని, బాధితులు కలెక్టర్ ఆర్డీవో కు మొరపెట్టుకున్నారు. శ్రీనివాస్ పై ఈ విషయంలో చీటింగ్ కేసు కూడా నమోదు అయిందని, తమ భూమి తమకు ఇప్పించాలని వృద్ధులు అధికారులను వేడుకున్నారు. శ్రీనివాస్ మంచిర్యాల పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తాడని, మమ్మల్ని మోసం చేసిన శ్రీనివాస్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని వృద్ధులు అధికారులను వేడుకున్నారు. గత కొద్దిరోజులుగా వృద్ధులమైన మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని మాకు ఆత్మహత్య శరణ్యమని పెట్రోల్ వెంట తెచ్చుకున్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గమనించి పెట్రోల్ డబ్బాలు లాక్కున్నారు. కాగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుండి వెళ్లిపోయారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల