CPR

CPR : ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు సీపీఆర్

మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

శెనార్తి మీడియా, మంచిర్యాల :

CPR  : ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు సీపీఆర్(CPR )తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రపంచ సీపీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో శనివారం జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులకు సీపీఆర్ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన శిబిరానికి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.అనితతో కలిసి కలెక్షర్ హజయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా సీపీఆర్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏటా ఎంతో మంది గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారన్నారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ (కార్డియో పల్మోనరి రిససిటేషన్) ప్రక్రియ తెలుసుకొని ఉండాలన్నారు. సీపీఆర్ లో ఛాతి దగ్గర నొక్కడం, రెస్క్యూ శ్వాసలు ఒకదాని తరువాత ఒకటి ఇవ్వడం భాగమని చెప్పారు. దీనితో శరీరమంతా ఆక్సిజన్ తో కూడిన రక్తప్రసారం జరిగి గుండె సాధారణ స్థితికి వస్తుందన్నారు. ప్రాణాపాయం నుంచి 50 శాతం వరకు బతికే అవకాశాన్ని మెరుగుపరుస్తుందన్నారు. సీపీఆర్ పిల్లలకు, పెద్దలకు భిన్నంగా ఉంటుందని తెలిపారు. మొదటి దశలో బాధితుల ప్రతిస్పందన కోసం చూడాలని, రెండో దశలో వ్యక్తి శ్వాస, నాడిని 5-10 సెకండ్ల పాటు పరిశీలించాలని, మూడో దశలో నాడి స్పష్టంగా లేకుంటే రొమ్ము ఎముకపై ఉన్న ఛాతి చనుమొనల మధ్య భాగాన్ని గుర్తించి వెంటనే ఛాతిని నొక్కడాన్ని ప్రారంభించాలన్నారు. నాలుగో దశలో మొదటి చేతిని నొక్కాల్సిన ప్రాంతంపై ఉంచి రెండో చేతిని మొదటి చేతిపై ఉంచాలన్నారు. ఐదో దశలో రెండు చేతుల వేళ్లను ఇంటర్లేస్ చేయాలని చెప్పారు. ఆరో దశలో భుజాలు రొమ్ము ఎముకపై ఉండేలా చూసుకోవాలని తెలిపారు. చేతులు నిటారుగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఏడో దశలో నిమిషానికి 100 నుంచి 120 సార్లు నొక్కడం చొప్పున 30 సార్లు ఛాతిని నొక్కాలని, నొక్కినప్పుడు ఛాతి కనీసం 2 నుండి 2.4 అంగుళాల వరకు నొక్కాలని సూచించారు. ఎనిమిదో దశలో 15 నుంచి 18 సెకండ్లలో 30 సార్లు నొక్కాలని, తొమ్మిదో దశలో హెడ్-టిల్ట్-చిన్-లిఫ్ట్ నైపుణ్యంతో చేయడం ద్వారా వాయు మార్గాన్ని తెరవాలని, ఒక చేతితో తలను వెనుకకు వంచి మరో చేతితో గదవని పైకి ఎత్తాలని (గదవ ఎముక భాగాన్ని పైకి లాగడానికి రెండు వేళ్ళను ఉపయోగించాలి), గదవ దిగువన మృదు కణజాలంపై నొక్కవద్దన్నారు. నోటిలో ఏదైనా కనిపిస్తే దానిని బయటకు తీయగలిగితే తీసివేయాలన్నారు. పదో దశలో రెండు సార్లు శ్వాస ఇవ్వాలని, శ్వాస ఇస్తున్నప్పుడు తలను వెనుకకు, గదవను వెనుకకు ఉంచాలన్నారు. సన్నని జేబురుమాలు ఉంటే దానిని రోగి నీటిపై పెట్టి ముక్కును పట్టుకోవాలని, శ్వాస ఇవ్వడం అసౌకర్యం ఉంటే సహాయం అందే వరకు నిరంతరాయంగా ఛాతిని నొక్కాలని తెలిపారు. సీపీఆర్ చేసే సమయంలో పక్కటెముకల మీద ఒత్తిడి చేయవద్దన్నారు. రొమ్మును ఎముకపై మాత్రమే బరువును ఉంచాలని, పొత్తి కడుపును కుదించవద్దని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కార్యకర్తలకు సీపీఆర్ పై అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని వివరించారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్నాయక్, ప్రోగ్రామ్ అధికారి కృపామయి, జిల్లా సంక్షేమశాఖ అధికారి కే చిన్నయ్య, సీడీపీఓలు, సూపర్వెజర్లు, వైద్య-ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *