యువతకు మంచి అవకాశం
PMIS : ఇంటర్న్‌షిప్ కోసం ఎదురు చూస్తున్న యువతకు కేంద్రం నుంచి శుభవార్త. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కు గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం పొందుతారు. నెలకు రూ.5వేల స్టైఫండ్ లభించడంతో పాటు, రిజిస్ట్రేషన్ చేసినందుకు ఆరు వేల రూపాయల ప్రోత్సాహకం అందుతుంది. ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 22. ఇంకా రిజిస్ట్రేషన్ చేయని వారు వెంటనే దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు.
గడువు ఎందుకు పెంచారు?
ఇంటర్న్‌షిప్ కోసం గతంలో ఇచ్చిన చివరి తేదీ ఏప్రిల్ 15. అయితే ఇంకా చాలామంది యువత దరఖాస్తు చేయలేదని తెలిసి, కేంద్రం ఈ గడువును మరో వారం పెంచింది. ప్రస్తుతం ఏప్రిల్ 22 వరకు అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తు ప్రక్రియను ఆ తేదీ లోగా పూర్తి చేయాలి.
స్కీమ్ లక్ష్యం ఏమిటి?
ఈ ఇంటర్న్‌షిప్ పథకం కేంద్ర బడ్జెట్ 2024–25లో ప్రకటించబడింది. యువత వృత్తిపరంగా ముందుకు సాగేందుకు అవసరమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌గా నియమిస్తారు. తద్వారా వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలకు తగిన అనుభవాన్ని సంపాదించవచ్చు.
ఆర్థిక సహాయం ఎలా ఉంటుంది?
- ఈ ఇంటర్న్‌షిప్ మొత్తం 12 నెలలు కొనసాగుతుంది
- ప్రతి నెలా రూ. 5,000 స్టైఫండ్ లభిస్తుంది
- యజమాని రూ. 500 చెల్లిస్తే, మిగతా రూ. 4,500 ప్రభుత్వమే నేరుగా ఖాతాలో జమ చేస్తుంది
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారికి ఒకసారి రూ. 6,000 ప్రోత్సాహకంగా అందుతుంది
- మొత్తం కలిపితే ఇంటర్న్‌షిప్ కాలంలో రూ. 66,000 ఆర్థిక సాయం లభిస్తుంది
అర్హతలు
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే:
- అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి
- వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి
- పూర్తిస్థాయి ఉద్యోగం లేదా రెగ్యులర్ చదువు చేస్తే అర్హత లేదు
- డిస్టెన్స్ లేదా ఆన్‌లైన్ పాఠశాలలో చదువుతున్న వారు అర్హులు
- కనీసం SSC లేదా ITI, పాలిటెక్నిక్, డిగ్రీ (BA, BSc, BCom, BCA, BBA, B.Pharmacy) పూర్తిచేసి ఉండాలి
దరఖాస్తు విధానం
- PMIS వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి
- పై భాగంలో ఉన్న భాష ఎంపిక చేసుకోవాలి
- “Youth Registration” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు చేయాలి
- ‘Submit’ బటన్ క్లిక్ చేసి తదుపరి దశల్లో అడిగిన వివరాలు పూర్తిగా ఇవ్వాలి