Heavy floods : రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద తాకిడికి జనావాసాల్లోని ఇళ్లలోకి సైతం నీరు వచ్చి చేరుతున్నది. మండలంలోని మొలంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తున్నది. ఒక్క మొలంగూరు పాఠశాల పరిస్థితి కాదు.. మండలంలోని మరికొన్ని పాఠశాలల పరిస్థితి కూడా ఇలాగే ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని సోమవారం విద్యార్థులకు సెలవు ప్రకటించిన విషయం వితమే. మండలంలోని పాఠశాలల పరిస్థితి రానురాను మరింత అధ్వానంగా మారుతున్నది. దీనిపైన విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలను మెరుగు పర్చాలని విద్యార్థులు గ్రామస్తులు కోరుతున్నారు.
దంచి కొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని అన్ని చెరువులు కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వరద నీరు చేరి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మండలంలోని ఎరడపల్లి, అర్కండ్ల, గద్దపాక గ్రామాలలో ఉన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజల రాకపోకలు స్తంభించాయి. ఆ గ్రామాలలో వాగు ఉధృతంగా ప్రవహించడం వలన ఈ రోడ్డుపై ప్రయాణాలు తగ్గాయి. అదేవిధంగా రైతుల పొలాల్లోకి నీరు చేరి పొలాలు నీట మునిగాయి.
-శెనార్తి మీడియా,శంకరపట్నం