-రాష్ట్ర అటవీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ
శెనార్తి మీడియా, మంచిర్యాల :
Minister Surekha: పోడు భూముల లో వ్యవసాయ సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించేందుకు విధివిధానాలు రూపకల్పన చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, శాసనసభ్యులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ పోడు భూముల సమస్య పరిష్కరించి అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించేందుకు విధివిధానాలు రూపకల్పన చేయాలని అన్నారు. పెండింగ్ దరఖాస్తులలో అర్హులైన వారిని గుర్తించాలని, భూముల విషయంలో ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాలని అన్నారు. జిల్లాలో గల భూమి గుర్తింపు, హద్దుల నిర్ధారణ అటవీ నిర్మూలన నిలిపివేత, అసలైన అభ్యర్థులకు గుర్తింపు, దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలు, ఇందుకు గల కారణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తిరస్కరించబడిన వివరాలు తదితర పూర్తి వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు.
2014-24 లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను పునః పరిశీలించి దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు నిజమైనవి అయితే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, గిరిజనేతరులను జాబితా నుండి తొలగించడం జరుగుతుందని, అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన సంక్షేమ సభ్యులు, అటవీ అధికారులు, గ్రామ సభ్యులను సమన్వయం చేసుకొని ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి వివరాలతో నివేదిక అందించాలని, జిల్లాస్థాయి అధికారులు పూర్తి వివరాలతో నివేదిక తయారుచేసి రాష్ట్రస్థాయి కమిటీకి సమర్పించాలని తెలిపారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ అటవీ భూముల రక్షణకై అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని, వన్యప్రాణుల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, గిరిజనులకు వ్యవసాయ సాగు గురించి మెలకువలు అందించాలని, భూమి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనాలు నాటే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కమిటీలను ఏర్పాటు చేసి నివేదికను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎలాంటి భూ ఆక్రమణలు జరగడం లేదని, ప్రభుత్వ భూముల రక్షణ కొరకు అధికారులకు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ చట్టం ప్రకారం భూముల వెరిఫికేషన్ చేసి త్వరలో వివరాలు అందిస్తామని తెలిపారు. పోడు భూముల పట్టా కొరకు గతంలో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులు ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి కమిటీల ద్వారా సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అనర్హులు ఆర్. ఓ. ఎఫ్. ఆర్. పట్టా పొందినట్లయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా అటవీ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అడవుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశిష్ సింగ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగాధర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.